
సమాజంలో నేడు వేగంగా వ్యాప్తి చెందుతున్న మధుమేహం నిరోధం చాలావరకు మన చేతుల్లోనే, చేతల్లోనే ఉందని ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వి.బి. కాశ్యప జన్నాభట్ల అన్నారు. ఆదివారం బ్రాడీపేట లోని ఎస్.హెచ్. ఓ. సమావేశ మందిరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా ,మధుమేహ నిరోధక మాసం సందర్భంగా “మధుమేహం -కారణాలు- నిర్ధారణ పరీక్షలు -చికిత్స- నిరోధక మార్గాలు “అనే అంశంపై నిర్వహించిన శాస్త్రీయ అవగాహన సభ, ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ కాశ్యప జన్నాభట్ల ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ,అధ్యక్షులు డాక్టర్ టి.సేవ కుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ కాశ్యప జన్నాభట్ల ప్రసంగాన్ని కొనసాగిస్తూ మధుమేహంకు జీన్స్ (జన్యుల)కు సంబంధం ఉందన్నారు. ఒకప్పుడు శరీరంకు తగినంత ఆహారం దొరకనప్పుడు ,తర్వాత ఆహారం ,ఆహారపు అలవాట్లు, శారీరకవ్యాయామం లేకపోవడం తదితర కారణాలవల్ల జన్యులలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. మధుమేహం గల వారిలో చాలా కాలం పాటు ఎలాంటి లక్షణాలు బయటపడమని, బయటపడిన తర్వాత కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. వైద్యుని సంప్రదించేసరికే శరీర అవయవాల్లో అనేక అనారోగ్య, నిర్మాణాత్మక మార్పులు జరిగి పోతున్నాయ న్నారు . 30 సంవత్సరాలు పైబడిన వారిలో ఇప్పటికే ప్రతి 100 మందిలో 14 మంది ఫ్రీ డయాబెటిక్ దశలో ఉన్నారన్నారు. వీరంతా తగిన నిరోధక చర్యలు చేపట్టకపోతే మధుమేహ బాధితులుగా మారి ఆరోగ్య ,ఆర్థిక నష్టాలకు గురికాక తప్పదు అన్నారు .30 సంవత్సరములు దాటిన వారు ప్రతి సంవత్సరం సంవత్సరాలకు ఒకసారి అయినా మధుమేహ పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు .సభాధ్యక్షులు డాక్టర్ టీ సేవకుమార్ మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరు వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహంపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు .మనం తీసుకొనే ఆహారంలో సమతుల పోషకాహారం లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్ లోపాలు రక్తహీనతకు, మధుమేహ నిరోధక ఇన్సులిన్ ఉత్పత్తి చేసేప్యాంక్రియాస్ పరిరక్షణకు అవరోధం కలిగిస్తున్నాయన్నారు . ఈ ప్రజారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలలో శాస్త్రీయ చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా తమ సంస్థలు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాక అతి తక్కువ ఖర్చుతో విటమిన్ డి ,బి12 , ఐరన్ లతో పాటు మొత్తం 86 పరీక్షల కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్ ను తమ సంస్థ అందిస్తోంది అన్నారు .సమావేశంలో పాల్గొన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి. ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ వ్యాధి బారిన పడిన తర్వాత పరీక్షలు- వైద్యులు -మందులు అనే ఒక విష వలయంలో చిక్కుకుపోకుండా ముందు జాగ్రత్తల పట్ల ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో తమ సంస్థలు ఈ అవగాహన సదస్సులు, సభలు ,వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి అన్నారు. ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. సభలో మానసిక వైద్య నిపుణులు, డాక్టర్ తేజస్విని,దంత వైద్య నిపుణులు ,డాక్టర్ చల్లా చైతన్య ,ఎస్. హెచ్. ఓ .మేనేజర్ పి .నిర్మల రాణి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి కే .సతీష్, కోశాధికారి టీ.వీ .సాయిరాం, ఎన్.సాంబశివరావు, చావా శివాజీ, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







