
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సమయంలో నిర్దేశిత ప్రమాణాల మేరకు క్యూరింగ్ జరిగేలా ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ ఏఈలు, డిఈఈలు, ఈఈలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సిసి రోడ్లు, డ్రైన్లను ఎంతో ఖర్చుతో నిర్మాణం చేస్తున్నామని, వాటిని నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేయకుంటే ప్రజాధనం వృధా అవుతుందన్నారు. కనుక పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు. నాణ్యత కల్గిన మెటీరియల్ వినియోగం, క్యూరింగ్ పై ద్రుష్టి పెట్టాలన్నారు. నూతన రోడ్ల ప్రతిపాదనల్లో ఎండ్ టు ఎండ్ ఉండేలా చూడాలన్నారు. పనులు పూర్తైన వెంటనే తమ ఇన్స్పెక్షన్ అనంతరం బిల్లుల చెల్లింపు కోసం నిధి పోర్టల్లో అప్ లోడ్ చేయాలన్నారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణ అనంతరం సదరు కాంట్రాక్టరే నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఏఈల వారీగా అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ పొందినవి, ప్రారంభించినవి, ప్రారభించనవి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్ డీని ఆదేశించారు. అనంతరం త్రాగునీటి సరఫరాపై సమీక్షించి, ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫిర్యాదులు అందితే డిఈఈలు నేరుగా ప్రత్యక్ష పరిశీలన చేసి పరిష్కారం చేయాలన్నారు. నగరంలో నూతనంగా నిర్మాణం చేయనున్న రిజర్వాయర్లు, యూపిహెచ్ లకు ఈ నెల 21న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంఖుస్థాపన చేస్తారని, అందుకు స్థానిక ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఈఈలను ఆదేశించారు.సమావేశంలో ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, ఈఈలు కోటేశ్వరరావు, విష్ణు, వేణు గోపాల్, అసిస్టెంట్ ఎగ్జామినర్ తిరుపతయ్య, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.







