
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపి హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషాలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని డిసెంబర్ 15న “ఆత్మార్పణ దినం“గా రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన స్పూర్తిగా నిలిచారన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని, అటువంటి నిస్వార్థ వ్యక్తుల త్యాగాలను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, తెలుగు ప్రజలు ఆయన త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని తెలియచేశారు. తొలుత హిందూ కాలేజీ సిగ్నల్ దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించ్చారుకార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మేనేజర్ బాలాజీ బాష, సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.







