
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర-స్వచ్చ ఆంధ్ర (సాసా) కార్యక్రమం శనివారం పర్యావరణ రంగంలో ఉపాధి అవకాశాలు అంశంపై స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని, జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ని ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం సాసా కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులతో నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ రంగంలో స్వయం ఉపాధి, వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలను బలోపేతం చేయడంపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. విద్యార్ధులకు ఆయా అంశాలపై వ్యాస రచన పోటీలు కూడా నిర్వహించాలన్నారు. శనివారం విజ్ఞాన మందిరంలో జరిగే కార్యక్రమంలో జిఎంసి స్టాల్స్ ని ఏర్పాటు చేస్తుందని, అందులో ఆయా డిపార్ట్మెంట్ల నుండి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలను ప్రతిబింబించేలా నమూనాలు సిద్దం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఏపిపిసిబి, ఎస్సీ కార్పోరేషన్, ఎస్ఈఈడిఏపి, మెప్మా, విద్యాశాఖ, ఏపిసిపిడిసిఎల్, అగ్రికల్చర్, హార్టి కల్చర్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారులు, ఐటిసి ఫినిష్ నారాయణ, జిఎంసి డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.







