
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ట్రావెలర్స్ బంగ్లా నుండి నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ వరకు ప్రధాన రహదారి వెంబడి అనధికారికంగా పార్కింగ్ నిషేధమని, పార్కింగ్ చేసిన వాహనాలను 24 గంటల్లోగా (గురువారం) స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే ట్రాఫిక్ పోలీసులు, జిఎంసి పట్టణ ప్రణాళిక సిబ్బంది సమన్వయంతో వాటిని జెసిబిలతో తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ నగరంపాలెం మెయిన్ రోడ్ లో పార్క్ చేసిన ట్రావెల్స్ బస్ లను తొలగింపుని నేరుగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ వంతెనల పనుల దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుందని, ప్రధాన రహదారులపై వాహనాలు రోజులతరబడి పార్కింగ్ చేసి సమస్య మరింత జటిలం అవ్వడానికి కారణమవుతున్నారన్నారు. ఇప్పటికే పలుమార్లు టిబి బంగ్లా నుండి నగరంపాలెం 3 బొమ్మల వరకు ఇరువైపులా అనధికారికంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించాలని తెలియచేసినా స్పందించడంలేదని, గురువారానికి తొలగించకుంటే సదరు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు, జిఎంసి పట్టణ ప్రణాళిక సిబ్బంది జెసిబిల ద్వారా తొలగిస్తారని, అందుకు పూర్తి భాధ్యత సంబందిత వాహన యజమానులే వహించాల్సి ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు, జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో ప్రధాన రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూడాలని ఆదేశించారు. పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, డిప్యూటీ సిటి ప్లానర్ సూరజ్, ట్రాఫిక్ సిఐ సింగయ్య, డిఈఈ కళ్యాణరావు తదితరులు పాల్గొన్నారు.







