
ఘన వ్యర్ధాలను పర్యావరణహితంగా నిర్వహించడానికి, నగరాల్లో డంపింగ్ యార్డ్ లు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు దోహదపడతాయని తమిళనాడు మునిసిపల్ శాఖ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్(డిఎంఏ) పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా గురువారం తమిళనాడు మున్సిపల్ విభాగం నుండి గుంటూరు వచ్చిన డిఎంఏ, మదురై కార్పోరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, హోసూర్ కార్పోరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్, ఏఈ (డిఎంఏ) రవి చంద్రన్ లు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, గుంటూరు నగరంలోని ఎంఆర్ఎఫ్, వెట్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్స్ ని పరిశీలించారు.ఈ సందర్భంగా తొలుత ప్లాంట్ సామర్ధ్యం, పనితీరు, అవసరమైన వ్యర్ధాలు, ఏఏ మున్సిపాల్టీల నుండి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయిన విద్యుత్ వినియోగం, విక్రయాలు, వ్యర్ధాల నుండి వచ్చే బూడిద నిర్వహణ, పర్యావరణ అంశాలు తదితర వివరాలను జిందాల్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జిందాల్ ప్లాంట్ నిర్వహణలో వ్యర్ధాల తరలింపుకు గుంటూరు నగరపాలక సంస్థ నోడల్ కార్పోరేషన్ గా ఉండి, ప్రతి రోజు షుమారు 4 వందల టన్నుల వ్యర్ధాలను పంపుతున్నామన్నారు. దీని వలన గుంటూరు నగరంలో ఎక్కడా డంపింగ్ యార్డ్ లు లేకుండా వీలు పడుతుందన్నారు. అలాగే ఏటుకూరు రోడ్ లో వెట్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్స్ ద్వారా ఘన వ్యర్ధాలను నిర్దేశిత ఎన్జీటి గైడ్ లైన్స్ మేరకు నిర్వహణ చేస్తున్నామని తెలిపారు.అనంతరం డిఎంఏ బృందం జిందాల్ ప్లాంట్ లోని టిప్పింగ్ ఫ్లోర్, గ్రాప్ కంట్రోల్ రూమ్, బాయిలర్స్, ప్లూ గ్యాస్ క్లీనింగ్ సిస్టం, సిబ్బంది, డీసిఎస్ కంట్రోల్ రూమ్ లు, వాటి పనితీరును అడిగి తెలుసుకొని, ప్లాంట్ కెపాసిటి, ప్రస్తుతం వస్తున్న వ్యర్ధాలు, పంపుతున్న మునిసిపాలిటీలు, రోజువారీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వ్యర్ధాల నిర్వహణ వంటి సమగ్ర వివరాలతో డాక్యుమెంట్ అందించాలని కోరారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో డిఎంఏ బృందం, నగర కమిషనర్ మొక్కలు నాటారు.పర్యటనలో ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, జిందాల్ ప్లాంట్ ఏపి ప్రెసిడెంట్ ఎంవీ చారి బృందం పాల్గొన్నారు.







