
జాతీయ గౌరవ దివాస్ శనివారం ఘనంగా జరిగింది. బిర్సా ముండా జయంతి సందర్భంగా గుంటూరులో గల గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో “జాతీయ గౌరవ దివాస్” గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. బిర్సా ముండా చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆదివాసీ స్వాతంత్ర్య పోరాటానికి జెండా పట్టిన ధీశాలి బిర్సా ముండా అన్నారు. చిన్న వయస్సు నుంచే బ్రిటీష్ పాలకులు, భూస్వాముల దోపిడీపై పోరాటం చేశారని చెప్పారు. “మన భూములు, మన జీవనం మన చేతుల్లోనే ఉండాలి” అని నిర్ణయించుకున్నారని తెలిపారు.బిర్సా ముండా ఆయుధాలను కాకుండా నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆయుధాలుగా చేసుకున్నారని చెప్పారు.బిర్సా ముండాను ప్రజలు ప్రేమతో “ధర్తీ ఆభా” అని పిలిచేవారని తెలిపారు. బిర్సా ముండా ఆశయాలు, స్ఫూర్తిని తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు బిర్సా ముండా ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. బిర్సా ముండా స్పూర్తితో యువత ధృడ సంకల్పంతో, పట్టుదలతో, కటపడే తత్వంతో ముందుకు సాగాలని కోరారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.







