
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయాలని, జిఎంసి, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చెరువుని పరిశీలించి, సోమవారానికి నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జిఎంసి, ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అందులో భాగంగా ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి పరిమాణం, వాటిని చుట్టుపక్కల వారికి, పొలాలకు ఇబ్బంది లేకుండా బెయిల్ అవుట్ చేయడం, పిచ్చి మొక్కల తొలగింపు అనంతరం పూడికతీతలపై జిఎంసి, ఇరిగేషన్ అధికారులు శని, ఆదివారాలు పరిశీలించి, సోమవారానికి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. నివేదిక మేరకు తదుపరి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిఎంసి సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ (ఇంచార్జి), ఇరిగేషన్ ఎస్ఈ వెంకటరత్నం, ఈఈ రమేష్ పాల్గొన్నారు.







