
తెలుగు భాషకు నిఘంటువు, వ్యాకరణమును అందించి తెలుగుకు వెలుగు నింపిన మహనీయులు సిపి బ్రౌన్ అని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన గుంటూరులోని విజ్ఞాన్స్ నిరులా మహిళ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సిపి బ్రౌన్ 227వ జయంతి సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ సిపి బ్రౌన్ తొలి తెలుగు సాహిత్య పరిశోధనలు అభివర్ణించారు 1820లో నాటి మంత్రాలు గవర్నర్ కోరిక మేరకు సిపి బ్రౌన్ తెలుగు భాషను అధ్యయనం చేసి ప్రాచీన గ్రంథాలను వెలుగులోకి తెచ్చినారన్నారు. 1821 లోని కడపలో రెండు పాఠశాలను స్థాపించి సామాన్య ప్రజలకు విద్యను అందించాలని వివరించారు పదవి విరమణ అనంతరం కూడా లండన్ లో తెలుగు భాషా బోధనలను కొనసాగించినారన్నారు. ఇండియన్ హౌస్ లైబ్రరీలో పడివున్న 2106 తెలుగు పుస్తకాలను మద్రాస్ గ్రంథాలయానికి చేర్చినారని తెలిపారు.ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రొఫెసర్ జి.కృపాచారి ప్రసంగిస్తూ సిపి బ్రౌన్ తన తండ్రి గారైన డేవిడ్ బ్రౌన్ నుండి స్ఫూర్తిని పొంది తెలుగు భాషను అత్యున్నత స్థాయికి చేర్చిన మహనీయుడని కొనియాడారు. వందలాది తాళపత్రాలకు రాత ప్రతులు సిద్ధం చేయించి, వాటిని ముద్రించి భవిష్యత్ తరాలకు అందించారన్నారు. 22 ఏళ్ల ప్రాయంలోనే కడప కలెక్టర్ కు అసిస్టెంట్ గా పనిచేస్తూ తెలుగు భాషలో లోటు పాటులను అర్థం చేసుకొని 49 మంది లేఖకుల సహకారంతో 23 మంది తెలుగు పండితుల కృషితో తెలుగు సాహిత్యాన్ని భద్రపరిచారన్నారు. మరుగున పడి ఉన్న వేమన పద్యాలను వెలికి తీసి ఇంగ్లీషు భాషలో ముద్రించి మహాకవి వేమన ను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా|| పాపినేని శివశంకర్ ప్రసంగిస్తూ సిపి బ్రౌన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరొందిన తెలుగు భాష గొప్పతనానికి మెరుగులు దిద్దిన మహనీయులు సిపి బ్రౌన్ అని పేర్కొంటూ జనచైతన్య వేదిక సిపి బ్రౌన్ 227వ జయంతిని జరుపుకోవడం అభినందనీయమన్నారు. సిపి బ్రౌన్ కడపలో తన ఇంటిని తెలుగు సాహిత్య చర్చలకు, ప్రాచీన గ్రంథాల సేకరణకు ఉపయోగించే వారిని గుర్తు చేశారు. 223 ప్రాచీన గ్రంథాలను పరిశీలించి వాటిని భవిష్యత్ తరాలకు అందించారన్నారు. థామస్ మన్రో,సర్ ఆర్ధర్ కాటన్, మెకంజీ లాంటి మహనీయుల కోవలో తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు సిపి బ్రౌన్ అని కొనియాడారు. విద్యను అందించారని తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ సిపి బ్రౌన్ జీవితాంతo బ్రహ్మచారిగా ఉంటూ తన జీతంలో అత్యధిక భాగం పేద విద్యార్థుల కోసం, అతి పేదల అభ్యున్నతి కోసం వినియోగించినారని, కడపలో జరగనున్న సతీసహగమనాన్ని ఆపించినారని తెలిపారు. నేడు కడపలో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ మంచి గ్రంథాలయాన్ని నిర్వహిస్తుందన్నారు. ఆంధ్ర భాషోద్ధారకులలో కలకాలం స్మరింప తగిన మహానీయుడు సిపి బ్రౌన్ అని కొనియాడారు. జాషువా కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకులు ప్రజా గాయకుడు పివి రమణ అభ్యుదయ గీతాలను ఆలపించి విద్యార్థులను జాగృతులను చేశారు.ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ నిరులా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా|| పి. రాధిక, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి ప్రసంగించారు. సభ ప్రారంభంలో సిపి బ్రౌన్ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.







