
నగరపాలక సంస్థ స్థలాల ఆక్రమణ పట్ల కఠినంగా ఉండాలని, పట్టాభిపురం మెయిన్ రోడ్ లో జిఎంసి స్థలం, డ్రైన్ ఆక్రమణ చేసి నిర్మాణం చేయడంపై పట్టణ ప్రణాళిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, సంబందిత టిపిబిఓ, పట్టణ ప్రణాళిక కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అదనపు కమిషనర్ ని ఆదేశించారు. బుధవారం పట్టాభిపురం మెయిన్ రోడ్ పూజిత స్కూల్ ఎదురు జిఎంసి స్థల ఆక్రమణ, అనధికార నిర్మాణం చేస్తున్న నిర్మాణాన్ని కమిషనర్ స్వయంగా వెళ్లి పనులను ఆపి, జిఎంసి స్థలం హద్దుగా డ్రైన్ ని తవ్వించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని ప్రధాన రోడ్ అయిన పట్టాభిపురం రోడ్ వెంబడే అనధికారికంగా నిర్మాణం చేస్తూ, డ్రైన్ ని మూసివేసి, జిఎంసి స్థలాన్ని చదును చేస్తుంటే పట్టణ ప్రణాళిక అధికారులు నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించి, జేసిబిలతో డ్రైన్ ని తవ్వించారు. అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ స్థల ఆక్రమణ జరుగుతున్నా నిర్లక్ష్యంగా ఉన్న టిపిబిఓ(ఇంచార్జి) నరేంద్ర, ప్లానింగ్ కార్యదర్శి రవి మాధవ్ లను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అనధికార భవన నిర్మాణదారునికి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఏసిపిని ఆదేశించారు. వార్డ్ సచివాలయాల వారీగా అనధికార కట్టడాలపై 2 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. నివేదిక మేరకు నిర్మాణాలను తొలగించడం, నిర్మణాలను అడ్డుకోకపోవడంపై కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకోనున్నామని తెలిపారు.అనంతరం చుట్టగుంట సెంటర్ లోని మురికిపేట దగ్గర వర్షం నీరు నిలిచి ఉండడం పరిశీలించి, తక్షణం నీటిని ఇంజిన్ లు ఏర్పాటు చేసి బెయిల్ అవుట్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మురికిపేటలోకి పక్కనే ఉన్న అవుట్ ఫాల్ డ్రైన్ పొంగి నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు.పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి రెహ్మాన్, డిఈఈ రమేష్ బాబు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







