
పన్నువసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మొండి బకాయిదారుల ఇళ్లు లేదా కమర్షియల్ సంస్థల ట్యాప్ కనెక్షన్ లు తొలగించాలని అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయాల వారీగా ఉన్న అసెస్మెంట్లు, బకాయిలు, రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, మాట్లాడుతూ, రోజువారీ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా చేయాల్సిన పన్ను వసూళ్లలో జీరో శాతంతో ఉన్న అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. సదరు కార్యదర్శులు వచ్చే వారం జరిగే సమీక్షా సమావేశం నాటికి పన్ను వసూళ్లలో పురోగతి చూపించకుంటే విధుల నుండి సస్పెండ్ వంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండో అర్ధ సంవత్సరం వచ్చినప్పటికీ ఆస్తి, ఖాళీ స్థల, త్రాగునీటి, మీటర్ల చార్జీలు వసూళ్లలో అలసత్వం వీడకుంటే ఎలా అని ప్రశ్నించారు. బకయిదారులకు పన్ను చెల్లింపుపై నోటీసులు ఇవ్వడం, స్పందించకుంటే ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు డిస్ కనెక్షన్ చేయడం, రెడ్ నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లపై డిప్యూటీ కమిషనర్లు మరింతగా క్షేత్ర స్థాయిలో పాల్గొనాలని, అధిక మొత్తం బకాయిదారులను నేరుగా కలవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు రవికిరణ్ రెడ్డి, మదన్ గోపాల్, రెహ్మాన్, సాదిక్ భాష, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.







