
పురపాలక సేవలను, ప్రభుత్వ సేవలను ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా పొందడానికి వీలుగా రూపొందించిన పురమిత్ర యాప్, మన మిత్ర వాట్సాప్ (9552300009) ని గుంటూరు నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పురమిత్ర యాప్ ద్వారా షుమారు 122 రకాల పురపాలక సేవలు, గ్రీవెన్స్ లు, చెల్లింపులను చేతిలోని ఫోన్ ద్వారానే పొందవచ్చన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలను పొందే యాప్ ని నగర ప్రజలు 38,971 మంది డౌన్లోడ్ చేసుకొన్నారన్నారు. సేవల కోసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు వాటి పరిష్కార స్తితిని తెలుసుకోవానికి ట్రాకింగ్ కూడా ఉండడంవలన ప్రజలకు తమ సమస్య, లేదా తమ దరఖాస్తు స్థితి తెలుసుకోవచ్చన్నారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి నిర్దేశిత గడువు ఉన్నందున సిబ్బంది కూడా భాద్యతగా వ్యావహరిస్తారని పేర్కొన్నారు.షుమారు 8 వందల రకాల ప్రభుత్వ సేవలను మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. అందులో ప్రధానంగా ఆర్టీసి, పిజిఆర్ఎస్, ఆర్టీజీఎస్, రెవెన్యూ, పురపాలన, సిఎం రిలీఫ్ ఫండ్, విద్య, మైన్స్, టిటిడి, ఆర్టీఓ, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన సేవలను పొందవచ్చన్నారు. కనుక నగర ప్రజలు పురమిత్ర, మన మిత్రలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.







