
నగరంలో అభివృద్ధి పనులు నిర్వహించిన అనంతరం నిర్మాణ వ్యర్ధాలను సంబంధిత కాంట్రాక్టర్ తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కమిషనర్ పెదపలకలూరు, రత్నగిరి కాలని, అరండల్ పేట తదితర ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులను మరియు సదరు ప్రాంతాలలో పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ పేద పలకలూరు, రత్నగిరి కాలనీ మరియు అరండల్ పేటలలో పర్యటించి, సదరు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సైడు కాలువలు మరియు రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, పనులు జరుగు సమయంలో ఎమినిటి కార్యదర్శులు పనులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు పూర్తైన అనంతరం నిర్మాణ వ్యర్ధాలను పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ తప్పని సరిగా తొలగించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తైన తరువాత వ్యర్ధాలను అక్కడే వదిలేస్తున్నారని ప్రజల నుండి పిర్యాదులు వస్తున్నాయని, సదరు వ్యర్ధాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం సదరు ప్రాంతాలలో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం తడి పొడి చేత్తలుగా విభజించి జరగాలన్నారు. మధ్యాహ్నం పూట తప్పనిసరిగా సైడు కాలువలను శుభ్రం చేయించాలని, సైడు కాలువలు శుభ్రం చేయుటకు ఆక్రమణలు ఏమైనా అడ్డుగా ఉంటె వాటిని తొలగించి, కాలువలను శుభ్రం చేయించాలన్నారు. ప్రజలు వ్యర్ధాలను కాలువల్లో మరియు రోడ్ల పై వేయకుండా తడి పొడి వ్యర్ధాలుగా విభజించి నగర పాలక సంస్థ పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని తెలియచేశారు. పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







