
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తీ చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కల్గించేలా విధ్యుత్ స్థంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏటి అగ్రహారం, శ్యామల నగర్, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టకుంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కనుక ఇంజినీరింగ్ అధికారులు తమ పరిధిలోని జరిగే పనులను నిర్దేశిత గడువు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే ప్రధాన రోడ్ల వెంబడి విధ్యుత్ స్తంభాలకు వివిధ రకాల కేబుల్స్ వేలాడుతూ ప్రజల, వాహనాల రాకపోకల సమయంలో అడ్డుపడి ప్రమాదకరంగా మారుతున్నాయని, వాటిని తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శ్యామల నగర్ లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన భవనంను పరిశీలించి, పట్టణ ప్రణాళిక సచివాలయ కార్యదర్శులు భవన నిర్మాణ సమయంలోనే నిర్దేశిత అనుమతి పొందిన ప్లాన్ మేరకు నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. పర్యటనలో ఈఈలు విష్ణు, కోటేశ్వరరావు, డిఈఈ రమేష్ బాబు, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







