
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మాంస వ్యర్ధాల అనధికార తరలింపుదారులపై చర్యలు తీసుకుంటామని, జిఎంసి నుండి నిర్దేశిత టెండర్ ద్వారా వ్యర్ధాల తరలింపు కాంట్రాక్ట్ పొందిన ఏజన్సీనే వ్యర్ధాలను సేకరిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో చికెన్ షాప్ ల అసోసియేషన్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చికెన్, మటన్, చేపల విక్రయదారులు తమ షాప్ లలో వచ్చే వ్యర్ధాలను అనధికార వ్యక్తులకు ఇవ్వడానికి వీలు లేదని, జిఎంసి అధీకృత ఏజన్సీ ప్రతినిధులకే అందించాలన్నారు. సదరు ఏజన్సీ, స్టాల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జిఎంసి అధికారులతో కలిసి సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏజన్సీ ప్రతినిధులు సేకరణ సమయం, సంప్రదించాల్సిన వారి వివరాలను స్టిక్కర్స్ చేసి ప్రాంతాల వారీగా స్టాల్స్ వద్ద ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, జిల్లా బాయిలర్ చికెన్ స్టాల్స్ ప్రెసిడెంట్ కిషోర్, పౌల్డ్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సురేష్, జాకీర్, వెంకయ్య పాల్గొన్నారు.







