
సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో వీధి కుక్కలను ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా వాటికి శాస్త్రీయ పద్దతిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు(ఏబిసి) చేయడానికి తగిన ఏబిసి సెంటర్ ని పొన్నూరు రోడ్ లో వేగంగా నిర్మాణం చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో కమిషనర్ అధ్యక్షతన ఏబిసి కమిటి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఇటీవల మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రే యానిమల్స్ పై నిర్దేశిత మార్గాదర్శకలు జారీ చేసిందన్నారు. సదరు మార్గదర్శకాల మేరకు గుంటూరు నగరంలో కూడా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేపట్టడం ద్వారా వాటి సంతతిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రతి రోజు వీధి కుక్కల సమస్యలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పొన్నూరు రోడ్ లో ఏబిసి సెంటర్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. జిఎంసికి ప్రత్యేకంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ని కేటాయించాలని పశుసంవర్ధక శాఖకు లేఖ రాస్తున్నామన్నారు. జంతు ప్రేమికులు కూడా వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి జిఎంసి చేపట్టే చర్యలకు సహకరించి ప్రజల సమస్యలు తీర్చడంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఏడి చక్రవర్తి, విఏఎస్ ఈశ్వరరెడ్డి, జిఎంసి సిఎంఓహెచ్ డాక్టర్ పి.శాంతి కళ, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, కమిటి సభ్యులు ప్రదీప్ జైన్, ప్రజారోగ్య విభాగ సూపరిండెంట్ పోలేశ్వరరావు పాల్గొన్నారు.







