
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా జరుగుతున్నసమగ్ర సర్వేకి వేగంగా పూర్తి చేయాలని, నోడల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక ఆకులవారితోటలోని 83,84 వార్డ్ సచివాలయాలను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, సర్వే ఆన్ లైన్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో సమగ్ర సర్వే ఖచ్చితమైన వివరాలతో అప్ లోడ్ చేయాలన్నారు. ప్రతి కార్యదర్శి తమకు కేటాయించిన క్లస్టర్ లో ప్రజలకు సర్వే అంశంపై వివరించి, నిర్దేశిత ఫార్మేట్ లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యదర్శులు ఐడి కార్డ్ లను తప్పనిసరిగా ధరించాలన్నారు. సర్వే పర్యవేక్షణకు విభాగాధిపతులు, సీనియర్ అధికారులను కేటాయించామని, తాము కూడా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. వివరాలు ఆన్ లైన్ చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే పిఎంయు టీంతో సంప్రదించాలని తెలిపారు. నగర ప్రజలు తమ ఇంటి వద్ద నుండే పురపాలక సేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పురమిత్ర, మన మిత్ర యాప్ లను కూడ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్గించాలన్నారు. అనంతరం సచివాలయ భవన సమస్యలను కార్యదర్శులు, నోడల్ అధికారి వివరించగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పర్యటనలో నోడల్ అధికారి పోలేశ్వరరావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







