
తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి పునాదిగా నిలుస్తూ, నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగిన నాయకులను తయారుచేసే కర్మాగారంలా పనిచేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 23వ, 28వ డివిజన్ల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లో నిజాలతో తిప్పికొట్టాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించే బాధ్యతను తామే తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి, వివరించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. అలాగే, నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోందని, ప్రతి కార్యకర్తే పార్టీ బలమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్లు మేళం సైదయ్య, తన్నీరు కృష్ణ,లామ్ వర్ధన్ , ఏపీ యాదవ్ మరియు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







