
కాశీబుగ్గ ఘటనకు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎండోమెంట్ దేవాలయమైన, ప్రైవేట్ దేవాలయమైన భక్తుల రద్దీకొద్దీ భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా..? అని ప్రశ్నించారు అంబటి. కాశీబుగ్గ ఘటనలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ గుంటూరులో వైఎస్ఆర్సిపి శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు, నూరి ఫాతిమా మాట్లాడుతూ దేవస్థానాల్లో భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో కూటమి సర్కార్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైయస్ఆర్సీపీ శ్రేణులను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే పనిలో బిజీగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లభించే పవిత్ర లడ్డు ప్రసాదం విషయంలో చంద్రబాబు దేవుడిని అడ్డుపెట్టుకొని చేసిన పాపాలు కారణంగానే రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి అన్నారు అంబటి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు నూరి ఫాతిమా. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె.







