
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ఉక్కు పాదం మోపుదామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఆవిష్కృతం చేయాలన్నారు. జిల్లాలో గట్టి నిఘా ఉండాలని అన్నారు. రవాణా వ్యవస్థపైన, విద్యా సంస్థలుపైన నిఘా ఉండాలని చెప్పారు. అన్ని పాఠశాలలు, కళాశాలలలో ఈగల్ క్లబ్ లు ఏర్పాటు చేయాలని, ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మత్తు, మాదక ద్రవ్యాల దిశగా అడుగులు వేయకుండా అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. మత్తు, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం, తయారీ, సరఫరా వంటి సమాచారం ఎక్కడ ఉన్నా తక్షణం పోలీసు అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. మందుల దుకాణాలలో కొన్ని మందులను వైద్యుల సలహాల మేరకు మాత్రమే వినియోగించాలని, నిబంధనలు ఉల్లంఘించే మందుల దుకాణాల లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, మత్తు మాదక ద్రవ్యాలు వలన ఆరోగ్యంపైనా, ఆర్థికంగాను పడే ప్రభావాలు తెలియజేయాలని అన్నారు. మాదక ద్రవ్యాలు వలన కుటుంబం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా బంధువులను, స్నేహితులను కోల్పోవడం జరుగుతుందని వివరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 65 కేసులు నమోదు చేశామని, 26 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఏడుగురుపై పి.డి కేసులు నమోదు చేశామని వివరించారు. ఒడిశా రాష్ట్రంతో పాటు, ఆ రాష్ట్ర సరిహద్దుల జిల్లాల నుండి రవాణా ద్వారా జిల్లాకు చేరడంతో పాటు ఇతర నగరాలకు రవాణా అవుతున్నట్లు గుర్తించామని వివరించారు. మత్తు మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, వినియోగం, రవాణాలో ఎక్కువ సార్లు భాగస్వామ్యం అవుతున్న వ్యక్తులపై హిస్టరీ షీట్స్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. 130 మంది ఎక్కువ సార్లు ఈ కార్యకలాపాలలో భాగస్వామ్యం అయినట్లు గుర్తించామన్నారు. నగర పాలక సంస్థ శివారు ప్రాంతాల్లోను, నిరుపయోగంగా ఉన్న భవనాల్లోనూ గంజాయి, మత్తు పదార్థాల వినియోగదారులు చేరుతున్నట్లు సమాచారం అందుతుందని, అటువంటి ప్రదేశాల పట్ల నగర పాలక సంస్థ అధికారులు దృష్టి సారించాలని కోరారు. 839 ఈగల్ క్లబ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడి నివారణ మాత్రలను వైద్యుల చీటి లేకుండా మందుల దుకాణాలు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం ఉందని, దానిపై దృష్టి సారించాలని అన్నారు. వసతి గృహాల్లోనూ నిఘా ఉండాలని, సామాన్య వస్తువులుగా ప్యాకింగ్ చేసి ఆర్.టి.సి, రైలు, ఇతర మాధ్యమాల ద్వారా రవాణా చేస్తున్నారని వాటి పట్ల డ్రైవర్లకు, కండక్టర్ లకు తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు.







