
వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతలో ఎక్కువ అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక స్తోమత పెంచడం అవసరం అన్నారు. వివాహం తర్వాత విధిగా నమోదు జరగాలని స్పష్టం చేశారు. వరకట్న నిషేధ చట్టం ద్వారా వరకట్నం అడగటం, తీసుకోవడం నేరమని, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.15 వేల వరకు అపరాధ రుసుం వేయడం జరుగుతుందని చెప్పారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన – వరకట్న నిషేధ చట్టం వివరాలను తెలిపారు. జీ.ఓ.28 ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో గృహ హింస చట్టం కింద 2022 సంవత్సరంలో 666 కేసులు, 2023లో 588, 2024లో 483 కేసులు, 2025లో 446 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ రామకృష్ణ, న్యాయ సలహాదారు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







