
జర్నలిస్ట్ ల అక్రిడిటేషన్ లకు అర్హులైన జర్నలిస్ట్ లుత్వరగా దరఖాస్తు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జె.డి) టి. కస్తూరి కోరారు. శనివారం గుంటూరు సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ సందర్శనకు విచ్చేసిన ఆర్.జె.డి మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అక్రిడిటేషన్ ప్రక్రియను వివరించారు. డిసెంబరు 15 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్రిడిటేషన్ లు జారీ చేయుటకు సిద్ధంగా ఉండాలని సంచాలకులు ఆదేశించి ఉన్నారని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో వేగవంతం చేయడం జరిగిందని చెప్పారు. అన్ని మీడియా యాజమాన్యాలు తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల జాబితా అందజేసి సహకరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులు తమ పేరును http://mediarelations.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. జి.టి.పి.ఎల్ నెట్ వర్క్ లో వార్తలు ప్రసారం చేస్తున్న లోకల్ ఛానెల్ లకు, ఎం.ఎస్.ఎం.ఇ లుగా నమోదు చేసుకున్న ఛానెల్ లకు అక్రిడిటేషన్ ల మంజూరుకు అవకాశాలపై కొంత మంది మీడియా ప్రతినిధులు కోరగా, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుల కార్యాలయంలో సంబంధిత అర్జీలు సమర్పించాలని, దానిపై వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. అక్రిడిటేషన్ ల ప్రక్రియలో భాగంగా అందుకున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్, డివిజనల్ పి.ఆర్.ఓ జె. శ్యామ్ కుమార్, వివిధ సంస్థల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.







