
ఆటా పాటలతో చిన్నారుల వికాసానికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. గుంటూరు నగరంలోని వాసవినగర్ మోడల్ ఫౌండేషన్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషన్ స్కూల్ లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రంతో సహా ఐదవ తరగతి వరకు ఉన్న అన్ని తరగతులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను పరిశీలించారు. వారి ఎత్తు, బరువులను స్వయంగా పరిశీలించారు. ఆటా పాటలతో, బోధన పరికరాలతో చిన్నారులకు బోధించే విధానాన్ని తనిఖీ చేసి ప్రతి రోజు ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే విధంగా ఉండాలన్నారు. ఫౌండేషన్ స్థాయిలోనే నైతిక విలువలతో కూడిన ఉన్నత ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఏ ఒక్క చిన్నారి తక్కువ బరువు, ఎత్తు కలిగి ఉండరాదని, పౌష్టిక ఆహారం అందించడం, నిర్దేశిత ప్రమాణాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరగాలని ఆదేశించారు. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉన్న అన్ని తరగతులను పరిశీలించారు. విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి విద్యా ప్రమాణాలు తనిఖీ చేశారు. విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విధానాన్ని పరిశీలించారు. తానే ఉపాధ్యాయునిగా మారి మూడవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉత్తమ బోధనకు ఉపాధ్యాయులు కట్టుబడి ఉండాలని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, సమాజం నడవడికను తీర్చిదిద్దుటకు, మార్గదర్శకం ఇచ్చుటకు ఒక సాధనం అన్నారు. గుణాత్మక విద్యను అందించాలని సూచించారు. చిన్నారులకు తయారు చేస్తున్న ఆహారాన్ని తనిఖీ చేశారు. మెనూ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాల పరిశుభ్రతలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి. రేణుక, ఉప విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర రావు, తహసిల్దార్ సుభాని తదితరులు పాల్గొన్నారు.







