
గుంటూరులో జాతీయ స్థాయి సదస్సు 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో ఈ నెల11వ తేదీన జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్ సంచాలకులు మైలపల్లి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ వాటర్ షెడ్ విభాగం సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్ లతో కలిసి శనివారం కేంద్ర సహాయ మంత్రి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ సదస్సు గుంటూరులో జరగడం గొప్ప అవకాశం అన్నారు. దీనిని ఒక అవకాశంగా తీసుకుని గుంటూరు పేరు ప్రతిష్టలు మారుమ్రోగే విధంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రతి అంశంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వాటర్ షెడ్ -పిఎంకేఎస్ వై జాతీయ సదస్సు (వాటర్ షెడ్ మహోత్సవ్) రెండు రోజుల పాటు – నవంబరు 10, 11 తేదీల్లో గుంటూరులో జరుగుతుందని ఆయన చెప్పారు.
మొదటి రోజు గుంటూరులో ఐటిసి హోటల్లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. రెండవ రోజు వెంగళాయపాలెంలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, అదనపు ఎస్పీ రమణ మూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తహసిల్దార్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.







