
దివ్యాంగులు… విభిన్న ప్రతిభావంతులని జిల్లా రెవిన్యూ అధికారి (డి.ఆర్.ఓ) ఎన్.ఎస్.కె.ఖాజా వలి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ గుంటూరు ఎన్.టి.ఆర్ స్టేడియంలో దివ్యాంగులకుశనివారం క్రీడా పోటీలను నిర్వహించింది. ఈ పోటీలను డి.ఆర్.ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారని అన్నారు. ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా, మోటివేటర్లుగా ఉన్నారని చెప్పారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చెప్పారు. దివ్యాంగుల్లో ప్రతిభకు కొదవలేదని వారిలో ఉన్న సృజనాత్మకతను మరింతగా వెలికి తీసి పదును పెట్టాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల్లో మంచి సృజనాత్మకతతో పాటు ఒక అంశం పట్ల స్పష్టమైన శ్రద్ధ ఉంటుందని అన్నారు. జిల్లాలో ఉన్న దివ్యాంగ క్రీడాకారులు మరింత పదునుతో క్రీడల్లో అభివృద్ధి చెంది జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను దివ్యాంగులకు అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాల్లోను, క్రీడారంగంలోను రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి మరియు ఇన్చార్జ్ దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకుల డి.దుర్గా భాయి మాట్లాడుతూ డిసెంబర్ మూడో తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను వివిధ అంశాల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. క్రీడా పోటీల్లోనూ, దివ్యాంగుల దినోత్సవం లోనూ పాల్గొనే దివ్యాంగ ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను దివ్యాంగులు అందిపుచ్చుకునే విధంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజనీర్ నజీమా, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







