
జిల్లాలో ఎన్.టి.ఆర్ భరోసా పించన్ల పంపిణీ విజయవంతంగా సాగింది. కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ప్రత్తిపాడు శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులుతో కలసి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ ప్రత్తిపాడు నియోజకవర్గంలో అల్లడి అన్నమ్మ, పాముల ఆదెమ్మ ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. పించన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకుమాను మండల కేంద్రంలో శనివారం కేంద్ర మంత్రి, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ విభాగాల పింఛనుదారులకు పంపిణీ చేశారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛనుదారులకు రూ. 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. జిల్లా మొత్తం పింఛన్లలో వృద్ధాప్యపు పింఛన్లు 1,18,174., వితంతువులు 70,112., చేనేతకారులు 3,862., గీతకార్మికులు 443., మత్స్యకారులు 570., ఒంటరి మహిళలు 11,330., చర్మకారులు 876., హిజ్రాలు 67., హెచ్.ఐ.వి బాధితులు 2,614., కళాకారులు 77., డప్పు కళాకారులు 854., దివ్యాంగులు 24,835., వైద్య సంబంధిత పింఛనుదారులు 1667., సైనిక సంక్షేమం 28., అభయహస్తం 3,994., అమరావతి భూముల సంబంధిత 17,401 పింఛన్లు పంపిణీ ఉన్నాయి. వరద బాధితులకు 3 వేలు సహాయం తుఫాను బాధితులకు రూ. 3 వేలు ఆర్థిక సహాయంను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయ లక్ష్మి, తహసీల్దార్ వెంకట స్వామి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి యువ కీర్తి, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







