
గతంలో రెండు దశాబ్దాల పాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో కాంట్రాక్ట్ ఏఎన్ఎం లుగా పనిచేసి తదుపరి అన్యాయంగా తొలగించబడిన వారిని హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి కొనసాగించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఎన్ఎం లతో కలిసి గుంటూరు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏఎన్ఎంలు కాంట్రాక్టు పద్ధతి పై అతి తక్కువ వేతనంతో పని చేశారు. అనేక సందర్భాలలో యాజమాన్యాలు మారుతూ వచ్చినా ఉద్యోగుల పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు వారిని నిరవధికంగా కొనసాగిస్తూ వచ్చాయి. 2022లో నాటి వైసిపి ప్రభుత్వ హయాంలో అర్బన్ హెల్త్ సెంటర్ల స్టాప్ పాటర్న్ మార్పు చేసి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అందరిని ప్రభుత్వం తొలగించింది. ప్రత్యామ్నాయంగా మరోచోట ఉద్యోగాలు కొనసాగించాలని కోరుతూ ఏఎన్ఎంలు పదేపదే అధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాబ్ పెడచెవిన పెట్టింది. ఏఎన్ఎంలు తదుపరి ప్రయత్నంగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 15 అక్టోబర్ 2025వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులలో పిటిషన్ దారులుగా ఉన్న సొంగ బసవ దేవి, జూగంటి రమాదేవి, వీర్నపు నాగేంద్రమ్మ, మంటి రోజు మేరీ, పెదపూడి లేయమ్మా, మన్యం మాణిక్యం తదితరులను కాంట్రాక్టు ఏఎన్ఎంలుగా 8 వారాలలోగా సర్వీసులోకి తీసుకొని కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు ఏఎన్ఎం లందరినీ వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందించారు. డిఎంహెచ్ఓ కే విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర అధికారుల సలహా మేరకు తదుపరి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ బసవ దేవి, జె రమాదేవి, ఎం మాణిక్యం, ఎం శిరోమణి తదితరులు పాల్గొన్నారు.







