
గిరిజనుల విద్య, ఆరోగ్య, ఉపాధి, సమగ్ర అభివృద్ధికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ బంగ్లా రోడ్డులోని కృషి భవన్ లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జన జాతీయ గౌరవ దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసిన గిరిజన నేతలు బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాము గంటందొర, బోనంగి పండులాల్, కుడుముల పడ్డ బయన్న, గ్రాము మల్లు దొర, హనుమంతప్ప తదితరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ నివాళులర్పించారు. తొలుత వేడుకలలో పాల్గొన్న పలు గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం తరహాలో మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, స్థానిక సంస్థలు, రాష్ట్ర అసెంబ్లీలోను జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సంచార జీవనం చేస్తున్న గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు తో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. గిరిజనుల సమస్యలను తెలుపుకునేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో ఫిర్యాదుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జాతి గౌరవాన్ని దేశ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న గిరిజన జాతుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులు గిరిజన నాయకులు బీర్సా ముండా జయంతి రోజును జన జాతీయ గౌరవ దినోత్సవం వేడుకలను నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోను స్వాతంత్ర ఉద్యమంలో పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు, గాము గంటందొర, బోనంగి పండులాల్, కుడుముల పడ్డ బయన్న, గ్రాము మల్లు దొర, హనుమంతప్ప తదితర గిరిజన నేతల త్యాగనిరతిని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందించేలా వేడుకలలో స్మరించుకోవడం జరుగుతుందని తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించారన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సామాజిక ,ఆర్థిక , రాజకీయ అభివృద్ధికి అనుగుణంగా పరిపాలన జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2049 విజన్ యాక్షన్ ప్లాన్ లో ఆనంద, ఆరోగ్య , సుసంపన్నమైన ఆంధ్ర ప్రదేశ్ సాధనలో భాగంగా గిరిజనులకు సామాజిక న్యాయం అందించేలా కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఇటీవల తుఫాను పునరావాస కేంద్రాలకు వచ్చిన గిరిజనులకు ఆధార్ కార్డులు లేవని, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగటం లేదని గుర్తించడం జరిగిందన్నారు. సహాయం అవసరమైన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ గిరిజనులందరికి రెవెన్యూ శాఖ ద్వారా ఆధార్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు మంజూరు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లో పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించే దిశగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధుల ద్వారా వెంటనే పనులు చేపడతామని తెలిపారు. విద్య ఒక్కటే ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకు వెళుతుందని సోషల్ గ్రాఫ్ మార్పు కోసం ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించేలా కృషి చేయాలని సూచించారు. సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గిరిజనుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, దీనిలో సమాజంలోని స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గిరిజన సంఘాల నాయకులు తెలిపిన అంశాలను జిల్లా స్థాయిలో అంశాలను వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ పాలసీలకు సంబంధించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గిరిధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సృజన, గిరిజన సంక్షేమ సంఘ నాయకులు చంద్ర నాయక్, సంజయ్ కందనాటి, బాపట్ల ఏసుబాబు, కొండగుంట కోటయ్య, రమావత్ కృష్ణా నాయక్, పసుపులేటి వరప్రసాద్, హేమలత, ఏవి పద్మారావు, విద్యార్థులు పాల్గొన్నారు.







