
గుంటూరు అరండల్‌పేటలో 58వ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…గ్రంథాలయాల నిర్మాణానికి పునాది వేసిన మహోన్నతులు, ఉద్యమకారుల సేవలను స్మరించుకుంటూ, నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు గ్రంథాలయాల మహోత్సవాల ద్వారా భావితరాలకు తెలియజేసే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అరండల్‌పేట గ్రంథాలయం నుంచి ర్యాలీ రూపంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.నేటి సామాజిక మాధ్యమాల యుగంలో పిల్లలు, యువత గ్రంథాలయాల వైపు మళ్లాల్సిన అవసరం మరింత పెరిగిందని పేర్కొన్నారు. గ్రంథాలయం అనేది నాలుగు గోడల మధ్య పుస్తకాల సమాహారం మాత్రమే కాకుండా, ‘జ్ఞాననిధి’ అని, ప్రతి ఒక్కరూ జ్ఞానార్జన కోసం గ్రంథాలయాలను ఆశ్రయించాలన్నారు. దేవాలయాలంతే గ్రంథాలయాలు కూడా సమాజానికి అవసరమయ్యాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తు చేశారు. గ్రంథాలయాల ద్వారా అనేక గొప్ప వ్యక్తులు తమ భావజాలం, విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారని, అలాంటి స్థలాలను పునరుజ్జీవింపజేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో లైబ్రరీల అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు.అలాగే, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ మంగళగిరిలో సాంకేతికతతో కూడిన ఐకానిక్ లైబ్రరీ ఏర్పాటు చేస్తూ రాష్ట్రానికి నూతన దిశ చూపుతున్నారని అభినందించారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు; మనిషి వెల్నెస్, హెల్త్, ఆనందం కూడా అభివృద్ధి భాగమే అని నారా చంద్రబాబు నాయుడు చెప్పిన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రంథాలయ కమిటీ సభ్యులు, నాయకులు, నిర్వాహకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.







