
రైతన్నా! మీ కోసం కార్యక్రమం జిల్లాలో సోమవారం ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారీయా గుంటూరు మండలం చిన పలకలూరు లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్యరంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోందన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో రూ. 308 కోట్లు ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సగటున సంవత్సరానికి 15 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. సమర్ధమైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులను మార్చుకోవాలని, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి డిమాంద్ వచ్చిందన్నారు. చిరు ధాన్యాల సాగు మరింత పెరగాలని, ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రి టెక్ ను ప్రోత్సహిస్తుస్తుందని చెప్పారు. ఎస్పీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పై 100 శాతం సబ్సిడీని ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ – పి.యం. కిసాన్ పధకం కింద రెండు విడతలు విడుదల జరిగిందన్నారు. సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు, అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు, పి.యం. కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు వెరసి సంవత్సరానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో
గత ఆగస్టు 2న మొదటి విడతగా 46,85,838 రైతుల ఖాతాల్లో రూ.3174.43 కోట్లు (కేంద్ర& రాష్ట్ర నిధులు) జమ చేయగా. రెండో విడతగా నవంబరు 19న 46,85,838 రైతుల ఖాతాల్లో రూ. 3135.01 కోట్లు (కేంద్ర & రాష్ట్ర నిధులు) జమ చేయడం జరిగిందని తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులు పాల్గొని వ్యవసాయ, అనుబంధ శాఖల పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి వారానికి రెండు రోజులు, రోజుకు రెండు గ్రామాల చొప్పున ఖరీఫ్ 4 నెలలు, రబీలో 4 నెలలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైతులకు పనిముట్లు పంపిణీ, కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ డ్రోన్ లతో కూడిన గ్రామ స్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఖరీఫ్ లో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు. కొనుగోలు చేసిన 48 గంటలోనే చెల్లింపులు జరుపుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.







