
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఆదర్శవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జి.జి.హెచ్, గనులు భూగర్భ శాఖలపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఎన్నో అపురూప ఘట్టాలు చూసిన పరిస్థితులు ఉన్నాయని, అటువంటి ఆసుపత్రి లో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందని పేర్కొంటూ అంతే స్థాయిలో వైద్య సేవలు అందించి ప్రజలకు చేరువ కావలసిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాలంలో వైద్య సేవలు పట్ల పలు ఆరోపణ రావడం బాధాకరమని ఆమె పేర్కొంటూ ఆసుపత్రి పేరు ప్రఖ్యాతులు ఇనుమడించుటకు అందులో పనిచేస్తున్న ప్రతి వైద్యుడు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. వైద్యుడు దేవుడితో సమానం అంటారని అటువంటి ఉన్నత వృత్తిలో ఉంటూ సంతృప్తికరమైన సేవలు అందించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ నొక్కి చెప్పారు. రాత్రి సమయాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం, సరైన సమయంలో వైద్యం అందకపోవడం, అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలుపై ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. సంపూర్ణమైన మార్పులు రావలసిన అవసరం ఉందని ఇందుకు పటిష్టమైనటువంటి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు ఎక్కువగా చికిత్స కొరకు వచ్చే ఆసుపత్రి అని ఇందులో నాణ్యమైన వైద్యాన్ని అందించడం అవసరమన్నారు. వసతి, భోజన సౌకర్యాలు మెరుగుపడాలని చెప్పారు. అవసరమైన అన్ని మందులు సిద్ధంగా ఉండాలని, మెరుగైన వైద్యం అందించుటకు వైద్యులందరూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించి వారి హృదయాల్లో వైద్యులు నిలిచిపోవాలని సూచించారు. *స్క్రబ్ టైఫస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి*స్క్రబ్ టైఫస్ ఫీవర్లు వివిధ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నయని వీటిపట్ల జిజిహెచ్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి వైద్యం అందించుటకు వైద్యులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.*అక్రమ మైనింగ్ ను నివారించాలి*జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా గ్రావెల్ రవాణా జరగడం, తవ్వకాలు జరగడం వంటి అంశాలను వివిధ మీడియాలో వస్తున్నాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఎక్కడ అక్రమ వారి ఇద్దరూ జరగరాదని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న క్వారీలు తదితర అంశాలపై సంపూర్ణ నివేదికను సమర్పించాలని ఆమె ఆదేశించారు. అక్రమ రవాణా చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీజ్ చేయాలని ఆదేశించారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో బండరాల్లో దొర్లుకుంటూ రావడం పట్ల కలెక్టర్ గనుల శాఖ అధికారులను ప్రశ్నిస్తూ అటువంటి వాటిపై తీసుకున్న చర్యలను అడిగారు. ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ, గనులు భూగర్భ శాఖ ఉపసంచాలకులు తదితరులు పాల్గొన్నారు.







