
జ్యోతి రావు పూలే గొప్ప సమాజ సంస్కర్త అని జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి అన్నారు. జ్యోతి రావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జ్యోతి రావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ మాట్లాడుతూ సమాజ సంస్కరణలలో అగ్రగామి, భారతీయ సామాజిక న్యాయ ఉద్యమానికి వైతాళికుడైన మహాత్మా జ్యోతిరావు గోవింద్రావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారన్నారు. చిన్న వయసులోనే అణగారిన వర్గాల స్థితిగతులు ఆయనను కదిలించాయని, చదువుపై ఆసక్తితో ముందుకు సాగిన ఆయన, సమాజంలో విద్యే సమానత్వానికి అసలు మూలం అనేది స్పష్టంగా గుర్తించారన్నారు. 1848లో భార్య సావిత్రీబాయి ఫూలేతో కలిసి భారతదేశంలోనే తొలి అమ్మాయిల పాఠశాలను ప్రారంభించి, మహిళా విద్యకు కొత్త యుగానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. దళితులు, పేదలు, మహిళలు, అల్పసంఖ్యాక వర్గాల జీవన ప్రమాణాల పెంపు కోసం జీవితాంతం పోరాడిన ఆయన అనేక పాఠశాలలను స్థాపించారన్నారు. ఫూలే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి కులవివక్ష, అంధవిశ్వాసాలు, సామాజిక అసమానతలపై గట్టి పోరాటం సాగించారని వివరించారు. తన రచనల ద్వారా బానిసత్వంపై ధైర్యవంతమైన ఆలోచనలను సమాజానికి పరిచయం చేశారని తెలిపారు. మహాత్మా ఫూలే సేవలు భారతీయ సంస్కర్తలకు, స్వాతంత్ర్యోద్యమ నాయకులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా హక్కు కోసం ఆయన చూపిన దారి నేటికీ దేశానికి ఆదర్శమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితమైన ఆయన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, తదితరులు పాల్గొన్నారు.







