
యువత మత్తు, మాదక ద్రవ్యాలు భారీన పడరాదని జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు దివ్యాంగుల శాఖ ఇన్ ఛార్జ్ సహాయ సంచాలకులు డి.దుర్గా భాయి పిలుపునిచ్చారు. యువత దేశ సంపద అని, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని… దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపించాల్సిన భాధ్యత యువతపై ఉందని అన్నారు. “నషా ముక్త భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మంగళవారం జె.కె.సి కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. అంటూ నినదించారు. ఈ సందర్భంగా దుర్గాబాయి మాట్లాడుతూ యువతను కాపాడు కోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. మత్తు, మాదక ద్రవ్యాలుపై వారి దృష్టి పడకుండా చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలను నివారించడానికి అందరు సమష్టి కృషి చేయాలని కోరారు. వివిధ కళాశాలలు, ఇతర విద్యా సంస్థలలో మాదకద్రవ్యాల ఉనికి లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వలన ఆరోగ్యం దెబ్బతింటుందని, కుటుంబ ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందని చెప్పారు. కుటుంబంలో ఒక వ్యక్తి గాడి తప్పితే ఆ కుటుంబం విచ్చిన్నకరంగా మారుతుందని, యువత వీటిని గుర్తించాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు పని చేసే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరూ సమైక్యంగా పనిచేసి సమాజంలో మాదక ద్రవ్యాలను రూపుమాపుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.ఈ సందర్భంగా “నషా ముక్త భారత్ అభియాన్” ప్రతిజ్ఞను చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.







