
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఈఎల్ఎస్ఆర్ ( ఓవర్ హెడ్ ట్యాంక్ ) లను నిర్దేశిత సమయంలో క్రమం తప్పకుండా శుబ్రపరచాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారుల ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారిపై వరద నీటి డ్రైయిన్ల నిర్మాణం, నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంక్ ల క్లీనింగ్ పై అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై చినకాకాని నుంచి తాడేపల్లి వరకు వరద నీరు నిలవకుండా ఉండేందుకు జాతీయ రహదారి అధికారులు, మంగళగిరి, తాడేపల్లి నగరపాల సంస్థ అధికారులు సమన్వయంతో డ్రైయిన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎంటిఎంసి అధికారులు ప్రతిపాదించిన ప్రణాళికలలో జాతీయ రహదారులు అధికారులు సూచనల మేరకు మార్పులు చేర్పులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. గుంటూరు నగరపాల సంస్థ పరిధిలోని ఈఎల్ఎస్ఆర్ లు క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. శుభ్రపరచడానికి అవసరమైన ప్రెజర్ మిషన్లు కొనుగోలు చేసి నగరపాలక సంస్థ సిబ్బందితో శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉండవల్లి నుంచి రా వాటర్ ను మరింత మెరుగ్గా పంపించేయడానికి నిపుణుల సూచనల మేరకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. సమావేశంలో ఎంటీఎంసీ కమిషనర్ ఆలీం భాష, జాతీయ రహదారుల పీడి పార్వతీశం, గుంటూరు నగరపాలక సంస్థ ఎస్ఈ సుందర రామిరెడ్డి, రేట్ పెయిర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.







