
నవంబరు నెలాఖరులోగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రైస్ కార్డుల ను ప్రభుత్వం ముద్రించి కార్డుదారులకు పంపిణీ చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. పంపిణీ ప్రక్రియను సెప్టెంబరు ఒకటవ తారీఖు నుండి సచివాలయాల సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా పంపిణీ ప్రారంభించామన్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,36,406 కార్డుదారులకు పంపిణీ పూర్తి అయిందన్నారు. కొంత మంది ఇతర ప్రాంతాలకు పనుల నిమిత్తము వెళ్లిన కారణంగా లేదా తమ కార్డులు ఎక్కడ ఉన్నదో తెలియని కారణంగా గాని జిల్లాలోని ఇంకా 49,209 కార్డులు పంపిణీ కాకుండా సచివాలయాల వద్ద మిగిలి ఉన్నాయని, ఈ పంపిణీ కార్యక్రమాన్ని నవంబరు నెలాఖరు వరకు గడువు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటి వరకూ కార్డులు పొందనివారు తమ సమీప సచివాలయం వద్దకు వెళ్లి తమ కార్డు ఎక్కడ ఉందో తెలుసుకొని, కార్డులో ఉన్న సభ్యులలో ఎవరైనా వేలిముద్ర వేసి స్మార్ట్ కార్డు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.







