
న్యూమోనియా వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. న్యూమోనియా వ్యాధి పై అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 12వ తేదిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కల్గించే పరిస్థితిని న్యూమోనియాగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. ఊపితిత్తులలో నెమ్ము చేరడం అని కూడా అంటారని తెలిపారు. నవంబర్12 వతేది నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సాన్స్ (న్యూమోనియా లక్షణాలను త్వరగా గుర్తిద్దాం.. పిల్లల బాల్యాన్ని ఊపిరి పీల్చుకోనిద్దాం) ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సాన్స్ కార్యక్రమంలో ఇంటింటి సర్వేను ఆశా కార్యకర్తలు, ఏ. ఎన్. ఎమ్ లు, సి.హెచ్.ఓ లు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ ముగ్గురు ఒక బృందంగా ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి వారికి న్యూమోనియా లక్షణాలు పరీక్షించి, ఒకవేళ ఉంటే పి.హెచ్.సి వైద్యాధికారి కి రెఫెర్ చేస్తారన్నారు. ఆశాకార్యకర్తలు రెఫెర్ కేసులను పి.హెచ్.సి వైద్యులు కు చూపించి అవసరమైన చికిత్స అందేలా చూస్తారని తెలిపారు. న్యూమోనియా పై అవగాహన కల్గివుందాం… న్యూమోనియా లేని సమాజాన్ని ఏర్పరచుకుందాం… అని పిలుపునిచ్చారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి మాట్లాడుతూ దేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు న్యూమోనియా వల్ల ప్రతీ ఏటా అధికంగా జరుగుతున్నాయన్నారు. న్యూమోనియా ముఖ్యంగా 5 సంవత్సరాల లోవు పిల్లలకు, తక్కువ పౌష్టికాహారం తీసుకొను పిల్లలకు, 60 సంవత్సరాలు పైబడిన వారికి వచ్చే అవకాశాలు ఎక్కువన్నారు. పిల్లల మరణాలను నిరోధించడానికి సాన్స్ ప్రోగ్రాం ప్రతీ సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఎక్కువ సమయం పొగకు గురికావడం, వాతావరణంలో మార్పులు, చాలా తక్కువ వ్యాధి నిరోధక టీకాల స్థాయి కల్గిగి ఉండుట, పౌష్టికాహారం సరిగ్గా తీసుకోక పోవడం, బిడ్డకు సరైన వెచ్చదనం కల్గించక పోవడం వంటివి న్యూమోనియా రావడానికి కారణాలు అన్నారు. జలుబు, దగ్గు, త్వరగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో పక్కలు(Ribs) ఎగరు వేయటం, అధిక జ్వరం, తల్లి పాలు, ఆహారం తీసుకొనక పోవుట, దడ, నిద్రమత్తు, ఛాతి అధికంగా కొట్టుకోవడం, అధిక బద్దకం, చురుకుగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయిలో విరివిగా న్యూమోనియా పై అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.







