
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బుధవారం పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు రూరల్ మండలం వెల్లలూరు, మామిళ్ళపల్లి గ్రామాలలో పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాను మూలిగే నక్క పైన తాటికాయ పడినట్టు రైతాంగం ఉసురు తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించే రైతులకు అత్యంత క్లిష్ట పరిస్థితి ఈ సంవత్సరంలో ఎదురైందని ఆయన తెలియజేశారు. గత సంవత్సరం పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక నష్టపోయిన రైతు సోదరులు, ఈ సంవత్సరం ఏరువాకకు అందాల్సిన పెట్టుబడి సాయం అందకపోగా అప్పుచేసి పండించిన అపరాలు, కూరగాయలు సైతం తీవ్రంగా నిరాశపర్చాయని చెప్పారు. తదనంతరం వేసుకున్న మాగాణి పంట రెండుసార్లు వర్షార్పణం అయ్యి మరొకసారి వేసిన పంటను ఈ తుఫాను తుడిచిపెట్టిందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన తెలియజేశారు. ఎరువులు సకాలంలో అందకపోవటంతో అరకొరగా వేసిన పంట సైతం నీట మునిగిందని ఈ సందర్భంగా తీవ్ర విచారంలో ఉన్న రైతు సోదరులు మనోనిబ్బరం కోల్పోవద్దని సూచించారు. ఎల్లకాలం ఇలాంటి పరిస్థితులు ఉండవని త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు . తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ప్రతి ఎకరాకు 20 వేల రూపాయలు అందజేసి, మరొక 30 వేల రూపాయలను వడ్డీ లేని రుణాలు రూపంలో రైతులకు అందజేసి కొంతలో కొంత స్వాంతన రైతులకు చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.







