
పోలియో బూత్ కు చిన్నారులను తీసుకురండి… రెండు పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఇందులో ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారని తెలిపారు. 2,57,980 డోసులు, 12,899 వాయల్ లు సిద్ధం చేశామని వివరించారు. 784 రిస్క్ ప్రాంతాలు గుర్తించమని, 958 పోలియో బూత్ లు, 16 ట్రాన్సిట్ పాయింట్లు, 6 బఫర్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.104 రూట్ లు, 72 మొబైల్ టీమ్ లు, 4,090 వ్యాక్సినేటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 4,406 మంది వైద్య, విద్యా శాఖ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. పోలియో చుక్కలు వేసిన తరువాత మూడు రోజులు ఇంటింటి పర్యవేక్షణ చేసి చుక్కలు వేయని పిల్లలను గుర్తించి, వేయడం జరుగుతుందని., గుంటూరు పట్టణంలో నాలుగవ రోజు కూడా చేపడతామని తెలిపారు. రెండు చుక్కలు నిండు ప్రాణాలు జీవితాంతం కాపాడతాయని అన్నారు. ఇటుక బట్టిలు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ ప్రదేశాలు, సంచార జాతులు, తదితర వర్గాల పట్ల దృష్టి సారించాలని ఆదేశించినట్లు చెప్పారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్లలో పోలియో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ, విద్యా శాఖ, మునిసిపల్, డి.ఆర్.డి.ఏ, మెప్మ, సంక్షేమ శాఖలు, సచివాలయ సిబ్బంది తదితర శాఖలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయని అన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార పోస్టర్లు. కరపత్రాలు, ర్యాలీలు, తదితర కార్యక్రమాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఏ. శ్రావణ బాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితతరులు పాల్గొన్నారు.







