
బానిస, రాచరిక వ్యవస్థలను అంతమొందించి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం లాంటి నినాదాలతో ముందుకొచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు కృషి చేయాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ సూరి పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ ఆదివారం ఉదయం గుంటూరు ఏసీ కళాశాలలోని అసెంబ్లీ హాలులో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల శిక్షణా కార్యక్రమంలో ప్రజాస్వామ్య విలువలపై జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ సూరి ప్రసంగించారు. 18వ శతాబ్దంలో అమెరికాలో నెలకొని ఉన్న బానిస వ్యవస్థ పై నాటి అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్ సైనిక పోరాటం చేసి విజయం సాధించారని తెలిపారు. ప్రజాస్వామ్య మనేది ప్రజల ప్రభుత్వమని, ప్రజల చేత, ప్రజల కోసమని నాటి అబ్రహాం లింకన్ ప్రపంచానికి తెలియజేశారని గుర్తు చేశారు. 1789లో ఫ్రెంచ్ ప్రజలు రాచరికంపై తిరుగుబాటు చేసి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనే నినాదాలతో ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పి నారని వివరించారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికి సమాన విలువ గల ఓటు హక్కును కల్పించడం ద్వారా నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం కొనసాగుతుందని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్, కస్టమ్స్ ఎస్. మధుబాబు, ఐఆర్ఎస్ ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి తార్కిక చింతనను పెంచుకొని ,జ్ఞాపక శక్తిని మెరుగు పరచుకుని, అధ్యయనం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని తద్వారా భవిష్యత్తు లో రాణించగలరని హితువు పలికారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, మంచి లక్ష్యాలను రూపొందించుకుని ఏకాగ్రతతో, పట్టుదలతో ఇష్టపడి చదివితే ఆశించిన గమ్యస్థానాలను చేరుకోగలరన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రతి అంశాన్ని అధ్యయనం చేసే క్రమంలో అవగాహన పెంచుకోవాలని, సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపై శ్రద్ధ పెడితేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందిస్తూ వాళ్లలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కె. సతీష్, కె. పావని, కె. అరుణాచలం మరియు రిసోర్స్ పర్సన్స్ జి. ప్రకాష్, బేతపూడి మంగారావు, షేక్ రెహమాన్, ఆదినారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.







