
ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా నీరు మరియు పారిశుధ్య కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) గ్రామాలుగా గతంలో ప్రకటించిన గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను గమనించాలన్నారు. ఎక్కడైనా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు అవసరం అనుకుంటే మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. తాగునీరు సరఫరాలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ కొత్తగా వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకు ప్రతిపాదనలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 115 అందాయని చెప్పారు. గ్రామ సచివాలయాల పరిధిలో 109 సామూహిక మరుగుదొడ్లు మంజూరు చేయగా, 101 పూర్తి చేయడం జరిగిందని వివరించారు. అంగన్వాడీల వద్ద 22 మంజూరు చేయడం జరిగిందని, వసతి గృహాలు తదితర ఇతర ప్రదేశాల్లో 17 మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. గ్రామ స్థాయిలో 171 నీరు మరియు పారిశుధ్య కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. 171 గ్రామాలను ఓ.డి.ఎఫ్ గ్రామాలుగా గతంలో ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లాలో 121 ఆవాసాల్లో 251 స్లో సాండ్ ఫిల్టర్లు ఉన్నాయని, అందులో 38 అవాసాల్లో గల 78 ఫిల్టర్లు పనిచేస్తున్నాయని, వాటి మరమ్మతులకు రూ.2.32 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. 23 ఆవాసాల్లో 48 పాక్షిక ఫిల్టర్లలో 24 పని చేయడం లేదని వాటి మరమ్మతులకు రూ.1.59 కోట్లు అవసరమని, 60 అవాసాల్లో 125 ఫిల్టర్లు ఉన్నాయని, అవి పని చేయడం లేదని అందుకు రూ.8.85 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. ప్రాధాన్యత ప్రాతిపదికన 49 చోట్ల అవసరమని గుర్తించామని అందుకు రూ.6.32 కోట్లు అవసరమని, జిల్లా పరిషత్ కు ప్రతిపాదించామని వివరించారు. 44 గ్రామాల్లో 66 లీకేజీలను గుర్తించి అరికట్టడం జరిగిందని చెప్పారు. జల జీవన్ మిషన్ కింద 313 పనులు రూ.94.97 కోట్లతో చేపడుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లాకు మరియు బాపట్ల జిల్లాలో కొంత భాగానికి ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్ డామ్ నుండి ఉపరితల నీటి సరఫరాతో తాగు నీటిని కల్పించుటకు వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలను రూ.7496 కోట్లతో తయారు చేసి సమర్పించాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి. రేణుక తదితరులు పాల్గొన్నారు.







