
జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరగాల్సిన ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. తుపాను కారణంగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు కూడా పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. జెడ్పీ ఛైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కోరం కోసం కొంత సమయం వేచి చూశారు. చివరికి కోరం లేక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే సమావేశం నిర్వహణ తేదీని ప్రకటిస్తామని చెప్పారు. అయితే గతంలో కూడా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో క్రిస్టినా జడ్పీ ఛైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీలో చేరిపోయారు. దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు ఛైర్ పర్సన్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఇరువురి నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఉద్దేశపూర్వకంగానే జనరల్ బాడీ మీటింగ్ కు సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది. మరోసారి జడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.







