
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన, ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగానికి ఆకర్షితులవుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా విద్యాసంస్థలు, వసతి గృహాల్లో అధికారులు నిరంతర పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారు వ్యసనపరులుగా మారకముందే వారికి అవసరమైన కౌన్సిలింగ్, సైకలాజికల్ సపోర్టు, డి అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో ఈగల్ క్లబ్బులను ఏర్పాటుచేసి నోడల్ అధికారులు, సభ్యుల వివరాలను అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు కోసం పోలీస్ శాఖకు అందించాలన్నారు. విద్యాసంస్థలలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వివరాలను తదుపరి సమావేశం నాటికి అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. http://GUNTUR NEWS
సంక్షేమ హాస్టల్స్ లోను నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మత్తు, మాదక ద్రవ్యాల దిశగా అడుగులు వేయకుండా అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. మత్తు, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం, తయారీ, సరఫరా వంటి సమాచారం ఎక్కడ ఉన్నా తక్షణం పోలీసు అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. వైద్యుల సలహాల మేరకు మాత్రమే మందుల దుకాణాలలో మత్తు కలిగించే వైద్య మందులు అమ్మకాలు జరిగేలా డ్రగ్ కంట్రోలర్ అధికారులు నిరంతరం తనిఖీ నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులు, యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా విస్తృత స్థాయిలో సదస్సులు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో నవంబరు 1వ తేది నుంచి 28వ తేదీ వరకు 12 కేసులు నమోదు చేసి, 42 మందిని అరెస్టు చేశామని, ఒక వాహనం సీజ్ చేశామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి యువతకు అవగాహన కోసం సంకల్పమ్ కార్యక్రమం ద్వారా సదస్సులు, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగంను అరికట్టడానికి పోలీస్ శాఖ రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి అరుణ కుమారి, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, డీఈవో రేణుక, తెనాలి ఆర్టీవో శ్రీహరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి , విబిన్న ప్రతిభావంతులు ఇన్చార్జి ఎడీ దుర్గాబాయి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఐసిడిఎస్ పిడి ప్రసునా, జిల్లా జైలు సూపరింటెండెంట్ బి కాంతరాజ్, డ్రగ్ కంట్రోలర్ ఏడీ లక్ష్మణ్, జి జి హెచ్ డి అడిక్షన్ సెంటర్ మానసిక వైద్యులు డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.







