
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు ఘటన దృష్ట్యా, జిల్లా పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేస్తూ, జిల్లా వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ప్రజా రక్షణ కొరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈమేరకు జిల్లా అదనపు ఎస్పీ ఏ. హనుమంతు ఆధ్వర్యంలో, జిల్లా భద్రత విభాగం (District Security Wing) ఆధ్వర్యంలో గుంటూరు రైల్వే స్టేషన్, APSRTC బస్టాండ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలను ప్రేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, ఇతర ప్రమాదకర పదార్థాల గుర్తింపు మరియు నిర్వీర్యం చేసే శిక్షణ పొందిన పోలీస్ సిబ్బంది, ప్రత్యేక జాగిల బృందాలతో కలిసి నిర్వహించారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో అదనపు ఎస్పీ ఏ. హనుమంతు, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి, జిల్లా ఎం.టి. ఆర్.ఐ. శ్రీహరి రెడ్డి, ప్రభుత్వ రైల్వే పోలీస్ RSI జ్యోతి, ఇతర అధికారులు, జిల్లా భద్రత విభాగం సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ఈ తనిఖీలలో రైల్వే స్టేషన్ పరిసరాలు, తినుబండారాల దుకాణాలు, ఇతర స్టాళ్లు, ప్రయాణికుల సామాను, ఆటో స్టాండ్, బైక్ స్టాండ్ ప్రాంతాలను బీడీ (Bomb Detection) టీమ్ మరియు పోలీస్ జాగిలాలతో పూర్తిగా పరిశీలించారు. ఏవైనా అనుమానిత పదార్థాలు, వస్తువులు లేదా అనుమానిత వ్యక్తులు ఉన్నారేమో అనే దృష్ట్యా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా, APSRTC బస్టాండ్ లో జిల్లా వెల్ఫేర్ ఆర్.ఐ. సురేష్ ఆధ్వర్యంలో, జిల్లా భద్రత విభాగానికి చెందిన శిక్షణ పొందిన జాగిల బృందాలతో కలిసి పార్సిల్ బుకింగ్ కౌంటర్లు, ప్రయాణికుల లగేజీలు, స్టాళ్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. పార్సిల్ వివరాలు, రవాణా మార్గాలు మరియు రవాణా చేసే వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి భద్రతా పరమైన చర్యలు చేపట్టారు. అనుమానిత లేదా ప్రమాదకర వస్తువుల రవాణాను అరికట్టి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఈ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని లేదా డయల్ 112 ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.







