
మెప్మా వార్షిక సంచిక ‘ అవని’ ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మెప్మా రూపొందించిన ‘ అవని’ వార్షిక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ‘ అవని’ సంచికలో స్పూర్తి గొలిపే గాథలు ప్రచురించడమే కాకుండా వివిధ జిల్లాల్లో మహిళా సంఘాలు సాధించిన విజయ గాథలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్త తయారుచేయాలనే ముఖ్యమంత్రి సంకల్పం. రాష్ట్రంలో మహిళ శక్తిని.. మహోన్నత శక్తిగా మార్చే ప్రక్రియకు నాంది పలికిందన్నారు. ఈ క్రమంలో ఒక్కో అడుగు వినూత్నంగా వేయడం జరుగుతుందని, మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ… వారికి సరికొత్త అవకాశాలను చూపిస్తూ.. ముందుకు సాగుతుందని తెలిపారు. మెప్మా చేపట్టిన 9 ప్రాజెక్టులకు ఇటీవల వచ్చిన స్కోచ్ అవార్డులు మెప్మాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయన్నారు. ఇందులో జిల్లాలోని ప్రతి మహిళా సంఘం వినూత్న రీతిలో కార్యకలాపాలు చేపడుతూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, మెప్మా పిడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







