
నగర ప్రజలు మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా డ్రైనేజి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ జిటి రోడ్ లో పారిశుధ్యం, నల్లపాడు రోడ్ లోని శ్రీనివాస కాలనీలో డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నల్లపాడురోడ్ లోని శ్రీనివాస కాలనీలోని పలు వీధులను, డ్రైనేజిని డ్రోన్ ద్వారా పరిశీలించి, స్థానికులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైన్ నిర్మాణానికి లెవల్స్ సపోర్ట్ చేయని ప్రాంతాల్లో నూతన సాంకేతిక ప్రమాణాలతో మ్యాజిక్ డ్రైన్ నిర్మించడానికి, కొండల నుండి వచ్చే వర్షం నీరు వెళ్లడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు కూడా వ్యర్ధాలను డ్రైన్లలో వేయవద్దని సూచించారు. నరసరావుపేట రోడ్ లో సెంట్రల్ డివైడర్లలో కలుపు తొలగించాలని హార్టికల్చర్ విభాగ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జిటి రోడ్ లో పారిశుద్య పనులను పరిశీలించి, మెయిన్ రోడ్లను ప్రతి రోజు ఉదయం పరిశుభ్రంగా స్వీపింగ్ చేయాలన్నారు. ఆయా మెయిన్ రోడ్లపై విధులు నిర్వహించే సమయంలో కార్మికులు తప్పనిసరిగా రేడియం జాకెట్స్ ధరించేలా చూడాలని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.పర్యటనలో కార్పొరేటర్ చల్లా రాజ్యలక్ష్మీ, ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, ఈఈ విష్ణు, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ నుండి మల్లికార్జునరావు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







