
వందేమాతరం.. ఒక చారిత్రాత్మక స్ఫూర్తి అని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. “వందేమాతరం 150 వసంతాల” ఉత్సవం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తిని, స్వాతంత్రోద్యమాన్ని “వందేమాతర” గీతం జ్వలింపజేసిందన్నారు. అటువంటి మహత్తర గీతం పుట్టి 150 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు.1875లో బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రేరణనింపిందన్నారు. ఆనందమఠం అనే నవలలో తొలిసారి భాగంగా వెలుగులోకి వచ్చిన వందేమాతర, 1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో ఊపిరిగానిలిచిందని పేర్కొన్నారు. బాల గంగాధర్ తిలక్, అరవింద ఘోష్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతిరాయ్ వంటి నేతలు ఈ పాటను జాతీయ ఉద్యమానికి సంకేతంగా ఉపయోగించారని తెలిపారు. దేశపట్ల నిష్కపటమైన భక్తి, త్యాగశక్తి, జాతీయ ఏకతను చాటిందని చెప్పారు. 150 వసంతాల తర్వాత కూడా – వందేమాతరం భారత ప్రజాస్వామ్య ఆత్మను, ఆత్మగౌరవాన్ని గుర్తు చేస్తూనే ఉందన్నారు. రాబోయే తరాలకు స్వతంత్ర భావజాలాన్ని మరింతగా అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యాసంస్థలు, సాంస్కృతిక తదితర సంస్థలు జాతీయ గీతం చరిత్ర, ప్రాధాన్యం, పోరాట వారసత్వాన్ని యువతకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. వందేమాతరం .. ఒక పాట కాదని.. భారత జాతికి గౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, ముఖ్య ప్రణాళిక అధికారి శేష శ్రీ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







