
ప్రజలకు, వాహనదారులకు శంకర్ విలాస్ ఆర్ఓబి వద్ద నిర్దేశించిన ప్రాంతాల్లో ప్రయాణించటానికి ఇబ్బంది లేకుండా నిర్మాణ పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి అరండాలపేట వైపు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు సూచనలు అందిస్తూ సర్వీస్ రోడ్లలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా గుత్తేదారులు నిర్మాణ పనులు నిర్వహించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నిర్మాణ పనుల సామాగ్రిని, పిల్లర్స్ త్రవ్వకాలలో వచ్చిన మట్టిని నిర్దేశిత ప్రాంతాల్లోనే నిల్వ చేసుకోవాలని సూచించారు. తాత్కాలిక మురుగు కాలవ నీరు రహదారిపై ప్రవహించకుండా సమీప కాలవలోకి మరలించేలా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీనివాస మూర్తి, ఆర్డీవో శ్రీనివాసులు, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, పనులు నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులు, మున్సిపల్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.







