
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, సమాజ పరిశుభ్రత పాటించడం ద్వారానే వ్యాధుల నుంచి రక్షణ పొందుతారని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం లాలుపురం గ్రామంలో జరిగిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర, కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి, చేతులు శుభ్రపరచుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులతో కలిసి చేతులు శుభ్రపరుచుకున్నారు. పరిశుభ్రత పై అవగాహన కోసం గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పొడి వ్యర్ధాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న స్వచ్చ రధం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో, గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశుభ్రమైన నగరాలు, గ్రామాలు సాధన దిశగా ప్రభుత్వం 2025 జనవరి నుంచి ప్రతినెల మూడవ శనివారం ఒక థీమ్ తో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అన్నారు. ఈ శనివారం వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనే అంశంతో నగర, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, అంగన్వాడి కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్ యాక్షన్ ప్లాన్ లో ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యమైన స్వర్ణాంధ్రం సాధించాలని లక్ష్యాలను నిర్దేశించారన్నారు. దీనికి వ్యక్తిగత శుభ్రత , సమాజ పరిశుభ్రత చాలా కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలని , ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేయాలని, భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత సక్రమంగా చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. శుభ్రత పాటించకపోతే అనారోగ్యానికి గురి అవుతారని చెప్పారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కుటుంబ సభ్యులకు పరిసర ప్రాంతల వాళ్లకు తెలియచేయాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత లేకపోతే సంబంధిత ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయాలని, అవసరమైతే జిల్లా అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. పిల్లలు తెలిపే సమస్యలను అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమాజ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి స్వయం సహాయక సంఘాలు కీలకమైన బాధ్యతలు నిర్వహించాలన్నారు. శుభ్రత లోపించడం వల్లనే నీటి ద్వారా సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పారిశుద్ధ్య విభాగం తో పాటు ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు పూర్తి సహకారం అందించాలన్నారు. తడి పొడి చెత్తను ఇంటిలోనే వేరు చేసి ఇవ్వటంతో పాటు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలకు నిత్యావసర సరుకులను స్వచ్ఛ రథాల ద్వారా అందించే వినూత్నమైన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విజిబుల్ క్లీన్ గా తీర్చిదిద్దేందుకు జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరుగుతుందన్నారు. గుంటూరు రూరల్ మండలంలో లాల్ పురం ను విజిబుల్ క్లీన్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. పరిశుభ్రత లో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దటంలో ప్రభుత్వ యంత్రాంగం తో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు, అధికారులతో జిల్లా కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వి జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, డి ఆర్ డి ఎ పీడీ విజయలక్ష్మి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో బండి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి కర్నాటి శ్రీనివాసరావు, ఎంపీపీ తోట లక్ష్మి, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సచివాలయ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.







