
సమన్వయంతో పని చేసి, జిల్లాలోసామాజిక రుగ్మతలను రూపుమాపుదామని స్వచ్ఛంద సంస్థలకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెత్త కుప్పలు, కాలువ గట్లు, మురుగు కాలువలు తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్, ఇతర సామగ్రిని సేకరించే చిన్నారులు ఉన్నట్లు గమనించటం జరిగిందన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు ఉండే అవకాశం ఉందని వాటిపై ప్రత్యేక దృష్టి సారించి రూపుమాపాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు బ్రహ్మాండమైన పనులు చేస్తున్నాయని ప్రశంసించారు. స్వచ్ఛంద సంస్థలు వివిధ రంగాల్లో పని చేయడం గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇదే స్పూర్తితో సామాజిక రుగ్మతలపై సమరం సాగించి జిల్లాను ఆదర్శంగా తీర్చిద్దడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయా సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి శేష శ్రీ, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, రెడ్ క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ పి.ఆర్.సి రాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







