
గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం పట్టణంలోని హిందూ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించిన కలెక్టర్, పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన తాగునీరు, వైద్య శిబిరాలు వంటి కనీస సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా బస్సు సౌకర్యం, పరీక్షల సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు తీరును, సమీపంలోని జిరాక్స్ సెంటర్ల మూసివేతను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డా.షేక్ సలీం భాషా మాట్లాడుతూ, మార్చి 16 నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాలలో మొత్తం 27,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన వివరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.http://GUNTUR LOCAL NEWS







